PALNADU POLITICS: కన్నాకు బాధ్యతలు.. 'కోడెల' విమర్శలు - కాకరేపుతున్న 'పల్నాడు' పాలిటిక్స్

Sattenapalli TDP incharge Fight: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఎన్నికలకు చాలా సమయం ఉండగానే... ప్రధాన పార్టీలు రంగంలోకి దిగాయి. ఓవైపు అధికార వైసీపీ, మరోవైపు ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం గట్టిగా జరుగుతోంది. సమయం దొరికితే చాలు... వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడుతున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీలన్నీ రోడ్ మ్యాప్ ను గీసుకుంటున్నాయి. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాతా టీడీపీ ఫామ్ లోకి వచ్చేసింది. ఓవైపు లోకేశ్ పాదయాత్ర చేస్తుండగా... మరోవైపు ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ చంద్రబాబు తెగ తిరిగేస్తున్నారు. ఇదిలా ఉంటే... పాల్నాడులో తిరిగి పట్టు సాధించే దిశగా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఓ సీటుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా సొంత పార్టీ నేతల మధ్య కుంపటి రాజేసినట్లు అయింది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందన్న చర్చ గట్టిగా జరుగుతుంది.

పల్నాడు ప్రాంతంలోని సత్తెనపల్లి టీడీపీ పార్టీ ఇంఛార్జ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. ఈ మధ్యనే కొత్తగా పార్టీలోకి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణను ఇంఛార్జ్ గా ప్రకటించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రి అంబటి రాంబాబు టార్గెట్ గా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ నడుస్తుండగా... కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామ్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నియామకం విషయంలో తీవ్రంగా స్పందించారు కోడెల శివరామ్. పార్టీ నిర్ణయం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేసేందుకు చివరి నిమిషం వరకు పోరాటం చేసిన కోడెల వంటి నేత కుటుంబానికి ఇదేనా ఇచ్చే గౌరవం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో ఉన్నప్పడు... కోడెల అనుచరులను ఇబ్బంది పెట్టిన చరిత్ర కన్నాకు ఉందని.. అలాంటి వ్యక్తికి ఇంఛార్ బాధ్యతలు ఎలా ఇస్తారని నిలదీశారు. ఇదంతా కూడా చంద్రబాబుకు తెలియకుండా జరుగుతుందేమో అని అభిప్రాయపడ్డారు. కార్యకర్తలు, నేతలతో చర్చలు జరుపుతున్నానని... వారి నిర్ణయమే తన నిర్ణయమని స్పష్టం చేశారు.

పార్టీ ఆవిర్భావం నుంచి పోరాటం చేసిన కోడెల కుటుంబం పైన ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించారు శివరామ్. అధిష్టానం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని వ్యాఖ్యానించారు. కన్నాకు బాధ్యతలు ఇవ్వటం పైన ఆగ్రహంతో ఉన్న కోడెల శివరాం… రాజకీయంగా ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక సత్తెనపల్లి నియోజకవర్గం నుంచే కోడెల శివప్రసాద్ చాలాసార్లు విజయం సాధించారు. 2014లోనూ గెలిచి స్పీకర్ గా అవకాశం దక్కించుకున్న కోడెల… 2019లో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే 2019 సెప్టెంబర్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత సత్తెనపల్లిలో టీడీపీ కార్యక్రమాలను శివప్రసాదరావు కుమారుడు శివరామే చూసూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ అనుకున్న క్రమంలో… కొత్తగా కన్నా పార్టీలోకి రావటం, ఇంఛార్జ్ గా ప్రకటించటంతో సీన్ మారిపోయింది. ఫలితంగా పల్నాడు పాలిటిక్స్ రసవత్తరంగా మారిపోయాయి.

2023-06-01T11:56:34Z dg43tfdfdgfd