Constable Death: పాముకాటుకు గురైన కానిస్టేబుల్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన ఘటన అమరావతిలో జరిగింది. తుళ్లూరు మండలం అనంతవరం ఆర్-5 జోన్లో విధుల కోసం వెళ్లిన కానిస్టేబుల్ పాము కాటుకు గురయ్యాడు. రెండు రోజుల క్రితం అర్థరాత్రి సమయంలో అనంతవరంలో విశ్రాంతి తీసుకుంటుండగా నిద్రలో ఉన్న కానిస్టేబుల్ భుజం, చేతి వేళ్లపై పాము కరిచింది.
ఘటనతో షాక్ గురైన బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సహచర కానిస్టేబుళ్లు వెంటనే పామును చంపేశారు. బాధితుడిని హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించేసరికి అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
రెండు రోజులు చికిత్స పొందిన కానిస్టేబుల్ బుధవారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ప్రకాశం జిల్లా తాళ్లూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. బందోబస్తు విధులకు వచ్చి పాము కాటుకు గురై చనిపోవడంతో సహచరుల్ని విషాదానికి గురి చేసింది.
మెరుగైన వైద్యం అందించడానికి గుంటూరు రమేష్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పటికే శరరీం మొత్తం విష ప్రభావానికి గురి కావడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. డయాలసిస్ చేసి ప్రాణాలు నిలిపేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
పాము కాటుకు గురైన కానిస్టేబుల్ ప్రాణాలను కాపాడేందుకు పోలీస్ ఉన్నతాధికారులు, ప్రకాశం జిల్లా పోలీసులు చివరి వరకు ప్రయత్నించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణానికి చెందిన పవన్ 2012 జవవరి 19లో పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. తాళ్లూరు, ఒంగోలు వన్ టౌన్, ముండ్లమూరులలో పనిచేసి మళ్లీ 2020 జనవరి 2న తాళ్లూరు పోలీస్ స్టేషన్లో జాయిన్ అయ్యారు. ఎస్సైగా ఎప్పటికై నా ఎంపిక కావాలని కలలు కనేవాడు. పవన్‌కుమార్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
మరోవైపు పాముకాటుకు గురై పోలీస్ కానిస్టేబుల్ చనిపోవడం పై విచారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. రాజధానిలోని ఆర్-5 జోన్ లో బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. పవన్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
మరోవైపు అమరావతి రాజధాని ప్రాంతంలో బందోబస్తు విధుల కోసం అన్ని జిల్లాల నుంచి రొటేసన్ పద్ధతిలో సివిల్ పోలీసుల్ని తరలించడం 2015లో మొదలైంది. రాజధాని ప్రాంతంలో విధుల నిర్వహణ కోసం ప్రత్యేక బలగాలు లేకపోవడంతో ప్రతి స్టేషన్ నుంచి ప్రతి రెండువారాలకు ఒకరిద్దరు చొప్పున కానిస్టేబుళ్లను కేటాయిస్తున్నారు.
రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే పోలీసు సిబ్బందికి స్థానికంగా ఎలాంటి వసతి ఉండదు. కమ్యూనిటీ హాళ్లు, ఆలయాలు, బడుల్లో ఆశ్రయం కల్పిస్తున్నారు. కనీస వసతులు లేకపోవడం, అనంతవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆరుబయట విశ్రమించాల్సిన దుస్థితిలోనే కానిస్టేబుల్ పాము కాటుకు గురయ్యాడు. దాదాపు ఎనిమిదేళ్లుగా దుర్భర పరిస్థితుల్లోనే పురుషులు, మహిళా కానిస్టేబుళ్లు అమరావతి ప్రాంతంలో విధులు నిర్వర్తించాల్సి వస్తోందని పోలీసులు వాపోతున్నారు.
2023-05-25T10:54:04Z dg43tfdfdgfd