CM YS Jagan Meets Finance Minister of India:కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన... దాదాపు 40 నిమిషాల పాటు ఆర్థికమంత్రితో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు. 2014-15కి సంబంధించిన వనరుల గ్యాప్ ఫండింగ్, 2016-2019 మధ్య కాలంలో జరిగిన పరిమితికి మించి రుణాలు కారణంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న పర్యవసానాలు, 2021-22లో రుణాల పరిమితిపై సడలింపులు అంశాన్ని ఆర్థికమంత్రితో చర్చించారు.
రాష్ట్రాన్ని విభజించిన తర్వాత తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్‌కో సరఫరా చేసిన విద్యుత్, రూ.6,756.92కోట్ల బకాయిల అంశాన్నీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించారు. ఇప్పటికే పలుమార్లు ఈ అంశాన్ని కేంద్ర దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఏపీ జెన్‌కో ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ డబ్బు చాలా అవసరమని, జాప్యం లేకుండా వీలైనంత త్వరగా ఈ డబ్బు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ మీద కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెన్స్ ఇచ్చేలా బడ్జెట్‌లో పొందుపరిచారని.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాల్లో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిందన్నారు. స్కూళ్లలో నాడు - నేడు కింద ఇప్పటికే రూ.6వేల కోట్లు ఖర్చుచేసిందని, తొలిదశ కింద 15,717 స్కూళ్లలో నాడు-నేడు కూడా పూర్తయ్యిందని, ఆరో తరగతి నుంచి ఐఎఫ్‌పీ ప్యానెల్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఆరోగ్య రంగంలో కూడా నాడు -నేడు కింద అనేక చర్యలు చేపట్టామని, విలేజ్ క్లినిక్స్ నుంచి టీచింగ్ ఆస్పత్రులవరకూ నాడు -నేడు కింద పనులు చేపట్టినట్లు వివరించారు.
రాష్ట్ర భవిష్యత్తును ఈ కార్యక్రమాలు తీర్చిదిద్దుతాయని.. వీటికోసం చేసిన ఖర్చును క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి స్పెషల్ అసిస్టెన్స్‌ను వర్తింపు చేయాల్సిందిగా ఆర్థికమంత్రిని ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారు. ఇక రేపు(శనివారం) ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి సీఎం జగన్ హాజరుకానున్నారు.
2023-05-26T16:54:26Z dg43tfdfdgfd