CM JAGAN: కర్నూలుకు సీఎం జగన్ .. వారి ఖాతాల్లో జమ కానున్న నిధులు

YSR Rythu Bharosa: సీఎం జగన్ గుంటూరు, కర్నూలు జిల్లా పర్యటన ఖరారైంది. జూన్ 1వ తేదీన రెండు జిల్లాలకు వెళ్లనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. గురవారం ఉదయం 7.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి మంగళగిరికి చేరుకుంటారు. అక్కడ సీకే కన్వెన్షన్‌ సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్న వైసీపీ నేత పేర్నాటి శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి సోదరుడి కుమారుడు కౌశిక్‌ వివాహానికి సీఎం హాజరుకాన్నున్నారు. ఇక అనంతరం కర్నూలు జిల్లాకు వెళ్లనున్నారు.

రైతు భరోసా నిధులు విడుదల…

కర్నూలు జిల్లా పత్తికొండలో వరుసగా 5వ ఏడాది మొదటి విడతగా వైస్సార్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం తర్వాత తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. సీఎం టూర్ దృష్ట్యా జిల్లా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టారు.

ఈ ఏడాది 52.31 లక్షలమంది రైతులకు తొలి విడతలో పెట్టుబడి సాయంగా రూ.7,500 చొప్పున సీఎం జగన్ జమ చేస్తారు. మొత్తం రూ.3,934.25 కోట్లను విడుదల చేయనున్నారు. పెట్టుబడి సాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతు కుటుంబాలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది కూడా రైతు భరోసా అందుకునే రైతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కింద అర్హులైన రైతులకు ఏటా మూడువిడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నన సంగతి తెలిసిందే. మే నెలలో రూ.7,500.. రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4 వేలు, మూడోవిడతగా జనవరిలో రూ.2 వేలు ప్పున పెట్టుబడి సాయం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.

ఈ నెలలో అందించనున్న సాయంతో కలిపితే.. ఈ నాలుగేళ్లలో సగటున 52.30 లక్షల మందికి వైఎస్సార్‌ రైతుభరోసా కింద రూ.30,996.34 కోట్ల పెట్టుబడి సాయం అందిచినట్లవుతుంది. రైతు భరోసాకు సంబంధించి గతేడాది 49,26,041 మంది భూ యజమానులు ఉంటే.. 1,23,871 మంది కౌలురైతులు, 91,031 మంది అటవీ భూ సాగుదారులు లబ్ధిపొందారు. ఈ ఏడాది తొలి విడత సాయం కోసం అర్హత పొందిన 52,30,939 మందిలో భూ యజమానులు 50,19,187 మంది కాగా.. అటవీ భూ సాగుదారులు 91,752 మంది, భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులు 1.20 లక్షల మంది ఉన్నారు.

పొలం పత్రాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకెళ్లి రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులై ఉండి రైతు భరోసా నగదు అందకపోతే.. వెంటనే స్థానిక సచివాలయాల్లో సంబంధింత సిబ్బందిని కలిసి, పట్టాదారు పుస్తకం, వ్యక్తిగత వివరాలను అందజేయాలి. రైతు వివరాలను సిబ్బంది వెరిఫై చేసి.... రైతులు అర్హులు అనుకుంటే, డబ్బు రావడం ఎందుకు ఆలస్యం అయ్యిందో చెబుతారు. ఒక వేళ ఏదైనా సమస్య ఉంటే దానికి పరిష్కరించేందుకు సచివాలయ సిబ్బంది ప్రయత్నిస్తారు.

2023-05-31T16:56:18Z dg43tfdfdgfd