CHANDRABABU ON CM JAGAN: జగన్ రెడ్డి.. గెలిచాడన్న అక్కసుతో అరెస్టు చేస్తావా..?

Chandrababu On MLC Results:ఏపీలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆసక్తిని రేపుతున్నాయి. మూడు స్థానాల్లో గెలిచి... అధికార వైసీపీ షాక్ ఇచ్చింది టీడీపీ. రెండు స్థానాలను సునాయసంగా గెలిచిన టీడీపీ... పశ్చిమ రాయలసీమలో హోరాహోరీగా తలపడింది. ఫైనల్ గా టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. అయితే ఆయన గెలుపు శనివారం రాత్రి ప్రకటించినప్పటికీ... ధ్రువీకరణపత్రం ఇవ్వకపోటం చర్చనీయాంశంగా మారింది.

ఆందోళనకు దిగిన టీడీపీ...

భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీగా గెలిచినట్లు ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవటంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు శనివారం రాత్రి ఆందోళనకు దిగారు. జేఎన్టీయూ కాలేజీ మెయిన్ గేట్ ముందు ఆందోళన చేపట్టారు. ఆందోళనలో కలెక్టర్,జాయింట్ కలెక్టర్ వాహనాలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఆందోళనలో మాజీ మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులుతో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

అర్ధరాత్రి తర్వాత... టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీగా గెలిచిన భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డిని కూడా పోలీసుల వ్యాన్ లోకి బలవంతంగా ఎక్కించారు. అనంతరం వీరిని అనంతపురం త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

చంద్రబాబు ఆగ్రహం....

భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డిని అరెస్ట్ చేయటం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఏం బతుకయ్యా జగన్ రెడ్డీ..ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి కి డిక్లరేషన్ ఇవ్వకుండా ఒత్తిడి చేసి అడ్డుపడతావా? పులివెందుల టీడీపీ నేత రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గా గెలిచాడని అక్కసుతో ఆర్థరాత్రి అరెస్టు చేస్తావా? ఇంతకంటే నువ్వు ఇంకేం బ్రష్టుపట్టిపోవాల్సింది ఉంది? ప్రజా తీర్పును గౌరవించి క్షమాపణ కోరు" అంటూ ట్విట్టర్ వేదికగా చంద్రబాబు డిమాండ్ చేశారు.

ధ్రవీకరణపత్రం ఇవ్వకపోవడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. డియర్ వైెస్ జగన్… ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీగా రాంగోపాల్ రెడ్డి 7543 ఓట్లతో గెలిచారు. రిటర్నింగ్ ఆఫీసర్ ధ్రువకీరణపత్రం ఇవ్వకపోవటం ప్రజాస్వామ్యబద్ధం కాదు. మీరు చేస్తున్న రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు వస్తుంది" అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

2023-03-19T05:23:36Z dg43tfdfdgfd