CHANDRA BABU HOUSE: రేపు తేలనున్న చంద్రబాబు ఉండవల్లి నివాసం భవితవ్యం

Chandra Babu House: భూ సమీకరణలో అక్రమాల నేపథ్యంలో ఉండవల్లిలో చంద్రబాబు ఉంటున్న ఇంటిని అటాచ్‌ చేస్తూ ఏపీ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇంటిని జప్తు చేయడానికి సిఐడి ప్రయత్నిస్తోంది. ఇంటిని జప్తు చేయడానికి ఏసీబీ కోర్టును ఏపీ సిఐడి ఆశ్రయించింది.

చంద్రబాబు కరకట్ట నివాసం జప్తు పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు బుధవారం ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బిందుమాధవి, తీర్పు జూన్ 2న వెలువరించనున్నారు. కరకట్టపై చంద్రబాబు ఇల్లు జప్తునకు అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లలో లింగమనేనికి లబ్ది చేకూర్చి బదులుగా ఆయన ఇంటిని గెస్ట్ హౌస్‌గా పొందారని సీఐడీ అభియోగాలు మోపింది. కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ ఇంటిని జప్తు చేసేందుకు అనుమతివ్వాలని కోర్టును కోరింది.

ఏపీ సీఐడీ తరపున 2 పిటిషన్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేశామని సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద తెలిపారు. లింగమనేని రమేష్ ఇల్లు అటాచ్ మెంట్ పిటిషన్ ఒకటి కాగా, మాజీమంత్రి నారాయణ బంధువుల ఆస్తుల జప్తు పిటిషన్‌ మరొకటని వివరించారు. 1944 ఆర్డినెన్స్‌ ప్రకారం తన పిటిషన్‌పై ఆర్డర్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

నేరం జరిగిందా లేదా అనేది తెలుసుకునేందుకు అవసరమైతే అఫిడవిట్ వేసిన అధికారిని కోర్టు విచారణ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ దశలో ప్రతివాదులకు నోటీసు ఇచ్చే అవకాశం లేదని చెప్పినట్లు తెలిపారు. జప్తు ఉత్తర్వులు ఇవ్వటమా, నిరాకరించటమా అనేది ఆదేశాలు వచ్చిన తర్వాత ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.

క్రిమినల్‌ లా సవరణ ఆర్డినెన్స్‌-1944 నిబంధన ప్రకారం ఎటాచ్‌మెంట్‌కు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ముందే ప్రతివాదులకు నోటీసు ఇచ్చి వాదనలు వినాల్సిన అవసరం లేదన్నారు. అనుమతించడం, లేదా తిరస్కరించడంపై ఏదో ఒక నిర్ణయం వెల్లడించాకే ప్రతివాదులకు నోటీసు ఇచ్చే ప్రశ్న వస్తుందన్నారు.వివిధ న్యాయస్థానాల తీర్పులను కోర్టుకు అందజేశారు. అనిశా కోర్టు ఇంఛార్జి ఆఫీసర్‌ ప్రతివాదులకు నోటీసు ఇస్తూ మే 17న జారీచేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవద్దని అభ్యర్థించారు.

వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌ తరఫున వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయవాది సోము కృష్ణమూర్తి కోరారు. కోర్టులో దాఖలుచేసిన దస్త్రాలను ప్రతివాదులకు ఇవ్వాలని సీఐడీని ఆదేశిస్తూ మే 17న న్యాయస్థానం ఆదేశాలిచ్చిందని గుర్తుచేశారు. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఇప్పటివరకూ దస్త్రాలను తమకు అందజేయలేదన్నారు.

దస్త్రాలు ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో మెమో దాఖలు చేశామన్నారు. వాదనలు చెప్పుకొనే అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని సీఐడీ చెప్పడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం అన్నారు. వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కోరుతూ వకాలత్‌ దాఖలు చేశారు. సీఐడీ దాఖలుచేసిన తీర్పుల పరిశీలన కోసం విచారణను జూన్‌ 2వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయాధికారి బి.హిమబిందు ఉత్తర్వులు జారీచేశారు.

2023-06-01T03:11:26Z dg43tfdfdgfd